‘కారు’ ప్రచారానికి ఎన్నారైలు

 ‘కారు’ ప్రచారానికి ఎన్నారైలు

  విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులందరూ రానున్న ఎన్నికల్లో పాల్గొనేలా దేశ విదేశాల్లో ప్రచారం నిర్వహించడానికి టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ న్యూజిలాండ్ శాఖ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 35 దేశాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకున్న మొదటి పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించింది. ఇదిలా ఉండగా పలువురు తమ వాహనాల నంబర్ ప్లేట్లను కేసీఆర్ పేరుతో ఉండేలా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

ఇప్పటికే న్యూజిలాండ్‌లో కళ్యాణ్‌రావు కాసుగంటి జైకేసీఆర్ అని రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కారుతో ప్రచారానికి శ్రీకారం చుట్టగా..లండన్ టీఆర్‌ఎస్ ఎన్నారై జనరల్ సెక్రటరీ సృజన్‌రెడ్డి చాడ ‘టీఆర్58 కేసీఆర్’ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సృజన్‌రెడ్డికి తొలుత ఫోర్డ్ కారు ఉండేది. అయితే ఆ కారుకు కేసీఆర్ పేరున్న నంబర్ ప్లేట్ బాగుండదని భావించి..లక్షలు వెచ్చించి ఏకంగా బీఎండబ్ల్యూ కారును కొనడం విశేషం. ఆ తర్వాత దానికి కేసీఆర్ పేరు వచ్చేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ నంబర్ ప్లేట్ కోసం ఆయన దాదాపు 2500 పౌండ్లు ఖర్చు చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నారై గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల నేతృత్వంలో లండన్‌లో ప్రచారం నిర్వహించనున్నట్లు సృజన్‌రెడ్డి చాడ ‘నమస్తే తెలంగాణ’కు తెలియజేశారు.