హెచ్1బి కుంభకోణం.. భారతీయుని అరెస్టు

 హెచ్1బి కుంభకోణం.. భారతీయుని అరెస్టు

 వాషింగ్టన్: హెచ్1-బి వీసా కుంభకోణం కేసులో అరెస్టయిన కిశోర్‌కుమార్ కావూరు (46) అనే భారతీయుని అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్టు చేసారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి అభియోగాలు నమోదు చేశారు. నకిలీ పత్రాలతో ఉద్యోగార్థులను అమెరికాకు రప్పించి జాబ్ కన్సల్టెన్సీ నిర్వహించేవాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం కావూరును అరెస్టు చేసి అమెరికా మేజిస్ట్రేటు జడ్జి సూజన్ ఫాన్ క్యూలెన్ ముందు హాజరుపర్చినట్టు అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 10 వీసా ఉల్లంఘనలకు, 10 మెయిల్ మోసాలకు అతడు పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే మొదటివాటికి పదేండ్లు, రెండోవాటికి 20 ఏండ్ల జైలుశిక్షలు పడతాయి. అలాగే ప్రతి అక్రమానికి రెండున్నర లక్షల డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2007 నుంచి కావూరు అమెరికాలో నాలుగు కంపెనీల పేరిట కన్సల్టెన్సీ వ్యాపారం నడుపుతున్నాడు. అభ్యర్థుల నుంచి అతను పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది.