కీలక దౌత్య పదవిలో భారతీయ అమెరికన్‌

కీలక దౌత్య పదవిలో భారతీయ అమెరికన్‌

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ న్యాయవాది మనిషా సింగ్‌ను విదేశాంగ మంత్రిత్వశాఖలో కీలక పదవికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ఆర్థికపరమైన దౌత్య వ్యవహారాలకు ఆమె ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఫ్లోరిడాకు చెందిన సింగ్‌ ప్రస్తుతం సెనేటర్‌ డాన్‌ సుల్లివన్‌కు సీనియర్‌ పాలసీ సలహాదారుగా, చీఫ్‌ కౌన్సెలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకానికి సెనేట్‌ ఆమోదముద్ర లభిస్తే విదేశాంగ శాఖలో ఆర్థిక దౌత్య వ్యవహారాల సహాయ మంత్రిగా వ్యవహరించిన ఛార్లెస్‌ రివ్కిన్‌ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ నామినేషన్‌ పత్రాలను అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం నాడే సెనేట్‌కు పంపారు. ట్రంప్‌ అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే రివ్కిన్‌ తన రాజీనామా పత్రాలను సమర్పించంతో ఈ పదవి గత జనవరి నుండి ఖాళీగానే వుంది. గతంలో విదేశాంగశాఖలోని బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌, ఎనర్జీ, బిజినెస్‌ అఫైర్స్‌ విభాగంలో సహాయ మంత్రిగా వ్యవహరించిన సింగ్‌ సెనేట్‌ విదేశీ సంబంధాల కమిటీకి సీనియర్‌ సలహాదారుగా కూడా వ్యవహరించారు.