మిచిగన్‌లో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

మిచిగన్‌లో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

 మిచిగన్‌ : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం బాధితుడి నుంచి నగదు, కారు, గుర్తింపు కార్డులు అపహరించుకుపోయారు. మిచిగాన్‌ రాష్ట్రంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహబూబాబాద్‌ పట్టణం బెస్తంబజార్‌కు చెందిన పూస ఎల్లయ్య, శైలజ దంపతులకు చెందిన కుమారుడు పూస సాయికృష్ణ లోరెంచ్‌టెక్‌ యూనివర్సిటీ సౌత్‌ ఫీల్డ్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ నెల 3న స్థానిక రెస్టారెంట్‌లో పార్శిల్‌ కోసం వెళ్లాడు. బయటకు వస్తున్న క్రమంలో కొందరు దుండగులు తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. కుడి చేతికి తీవ్రంగా గాయమైంది. బాధితుడు కుప్పకూలగానే అతని వద్ద నుంచి డబ్బు, గుర్తింపు కార్డులు సహా కారును ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు.