శ్వేతసౌధంలో ఎన్నారైకి కీలక పదవి

శ్వేతసౌధంలో ఎన్నారైకి కీలక పదవి

 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కమ్యూనికేషన్స్ విభాగం బృందంలో భారత సంతతి వ్యక్తి రాజ్ షాకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రవాస భారతీయుడైన రాజ్ షా డొనాల్డ్ ట్రంప్‌కు సహచరుడు. ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ట్రంప్ వెంట ఉన్న అతికొద్ది మందిలో షా (32) ఒకరు. తనకు డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేసిన షాను ఇప్పుడు కమ్యూనికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ట్రంప్ నియమించినట్టు బుధవారం వైట్‌హౌస్ తెలిపింది.

అధ్యక్షుడు ట్రంప్‌కు రాజ్‌షా డిప్యూటీ అసిస్టెంట్‌గా సేవలు అందించడంతోపాటు ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తారని పేర్కొన్నది. తన కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా హోప్ హైక్‌ను ట్రంప్ నియమించారు. ఈయన గతంలో ట్రంప్‌కు అసిస్టెంట్‌గా, అంతర్గత కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. గుజరాత్‌కు చెందిన రాజ్ షా కుటుంబం 1980లో అమెరికాకు వలసవెళ్లింది. అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలోనే రాజ్ షా పుట్టి పెరిగారు.