టీడీపీకి మరో  షాక్: పార్టీని మారనున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి!

టీడీపీకి మరో  షాక్: పార్టీని మారనున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి!

టీడీపీకి మరో  షాక్: పార్టీని మారనున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి!

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. గడచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, అందులో 12 మంది అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీకి చెందిన సీనియర్ నేతలు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పార్టీని పార్టీని వీడనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డితో ఆమె చర్చలు జరిపినట్లుగా సమాచారం. తెలంగాణలో ఇక టీడీపీ మనుగడ కష్టమని నిర్ధారణకు వచ్చిన ఆమె తన కార్యకర్తల సూచన మేరకు టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్‌కు బలమైన నేత అవసరం ఉండడంతో కాంగ్రెస్‌ నేతలు ఉమా మాధవరెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు చొరవ చూపించారు. ఆమె రాకపై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇచ్చి, ఓ ముహూర్తాన్ని ఖరారు చేసి, భారీ బహిరంగ సభ ద్వారా ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే గనుక జరిగితే నల్గొండ జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బే. మాధవరెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ టీడీపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే మావోయిస్టుల మందుపాతరకు ఆయన బలైపోయారు. ఆయన మరణంతో భార్య ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.