ఈ ఏడు పూర్తి ఆకృతిలో అమరనాథుడు

ఈ ఏడు పూర్తి ఆకృతిలో అమరనాథుడు

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. ఈ ఏడాది అమరనాథుడు భక్తులకు పూర్తి ఆకృతిలో దర్శనమివ్వనున్నాడు. ఈ సంవత్సరం మంచు శివలింగం పూర్తిస్థాయిలో ఏర్పడింది. గతంలో కంటే ఈసారి మంచు శివలింగం పెద్దదిగా కనిపించనున్నది. గుహ చుట్టూ పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచు శివలింగం ఎక్కువకాలం ఉండడానికి దోహదపడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శ్రీఅమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు(ఎస్‌ఏఎస్బీ) ఆధ్వర్యంలో కొన్ని బ్యాంకుల్లో మొదలైంది.

గత నెలలో హెలిక్యాప్టర్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని వచ్చే నెల 29 నుంచి ఆగస్టు 7 వరకు తెరిచి ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్‌ఏఎస్బీ విడుదల చేసింది. యాత్రకు వెళ్లే క్రమంలో నొప్పి నివారణ మందులు, నిద్ర మాత్రలు, కెఫిన్ ఉన్న పానీయాలు, పొగ, మద్యాన్ని తాగకుండా ఉండాలని సూచించింది.