శాకాహారులకు గుండె జబ్బులు తక్కువే

శాకాహారులకు గుండె జబ్బులు తక్కువే

 న్యూయార్క్‌: శాకాహారం తినే వారికి గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్‌ వచ్చే అవకాశం తక్కువేనని దక్షిణాసియా వాసులపై జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారం తీసుకునే వారిలో లోయర్‌ బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) ఉన్నట్లు పరిశోధకుల్లో ఒకరైన భారత సంతతికి చెందిన వ్యక్తి తెలిపారు. మాంసం తినేవారితో పోలిస్తే శాకాహారుల్లో నడుము చట్టుకొలత చిన్నగా ఉన్నట్లు, పొట్టలో కొవ్వు తక్కువగా ఉన్నట్లు,  తక్కువ కొలెస్ట్రాల్‌, బ్లడ్‌ షుగర్‌ ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను బోస్టన్‌లో జరిగిన న్యూట్రిషన్‌-2018 సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు.

సరాసరి 55 ఏళ్ల వయసున్న 892 మంది దక్షిణాసియా వాసుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధించి ఈ వివరాలు వెల్లడించారు.అలాగే శాకాహారం తీసుకునే పురుషుల్లో కరోనరీ ఆర్టరీ కాల్షియం అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు తేలింది. శాకాహారం గుండెకు రక్షణ ఇస్తుందా లేదా అని నిర్ణయించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని బృందం పేర్కొంది.