కాలుష్యంతోనే బ్లడ్ మూన్

కాలుష్యంతోనే బ్లడ్ మూన్

  బెంగళూరు : అంతరిక్షంలో ఈ నెల 31వ తేదీన ఓ అరుదైన ఘటన చోటుచేసుకోబోతున్నదని నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన సూపర్‌మూన్, బ్లూమూన్‌తోపాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తి ఎరుపు రంగులో కనిపిస్తాడని నాసా తెలిపింది. అందుకే దీనిని సూపర్ బ్లడ్‌మూన్ అని కూడా పిలుస్తుంటారు. నిజానికి గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారడని, వాతావరణ కాలుష్యం కారణంగా కాంతి ఎరుపు రంగులోకి మారుతుందని బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియం సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ మధుసూదన్ పేర్కొన్నారు.

వాతావరణంలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కారణంగా కాంతి వక్రీభవనం చెంది ఎరుపు రంగులో కనిపిస్తుందన్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట, సూపర్‌మూన్ సమయంలో మరింత ముదు రురంగులో కనిపిస్తుందని వివరించారు. సూపర్‌మూన్ రోజున గ్రహణం ఏర్పడటాన్ని భారతీయులు ఎప్పుడో గుర్తించారని, క్రీ.శ 576లో ఆర్యభట్ట నమోదు చేశారని చెప్పారు. అమెరికావాసులకు 150 ఏండ్ల తర్వాత బ్లడ్‌మూన్ కనిపిస్తున్నదని, భారత్‌లో 1963, 1982లో బ్లడ్‌మూన్ కనిపించిందని చెప్పారు.