నేడు పాక్షిక సూర్యగ్రహణం

నేడు పాక్షిక సూర్యగ్రహణం

  న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి పాక్షిక సూర్యగ్రహణం గురువారం కనిపించనుంది. గడిచిన ఆరునెలలో ఇది రెండవ సూర్యగ్రహణం. గత ఏడాది ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. భూమికి, సూర్యుడికి మధ్య కొంతమేర చంద్రుడు అడ్డుగా రావడంతో గురువారం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంటార్కిటికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమభాగం, చిలీ, అర్జెంటీనా, దక్షిణ బ్రెజిల్ వాసులు దీనిని చూడొచ్చు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:25 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4:17 గంటల వరకు గ్రహణం సంభవించనున్నందున చూసే అవకాశం లేదు.

మనదేశంలో సూర్యగ్రహణం కనిపించనందున గ్రహణ నియమాలను ఆచరించాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలై 13, ఆగస్టు11న మరో రెండు పాక్షిక సూర్యగ్రహణాలు సంభవిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు గ్రహణాలు కూడా భారత్‌లో కనిపించవు. సూర్యగ్రహణం కనిపించని దేశాల ప్రజలు.. ఇంటర్నెట్‌లో నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందించవచ్చు.