బ్రూఫిన్ వాడితే.. సెక్స్ సామర్థ్యం తగ్గుతుందట !

బ్రూఫిన్ వాడితే.. సెక్స్ సామర్థ్యం తగ్గుతుందట !

 హైదరాబాద్ : బీ అలర్ట్. మీరేమైనా పెయిన్ కిల్లర్ వాడుతున్నారా. అది బ్రూఫిన్ అయితే ఒక క్షణం ఆగండి. ఆ పెయిన్ కిల్లర్ వాడితే..పురుష పునరోత్పత్తి హార్మోన్లు తగ్గుతాయట. ఈ విషయాన్ని తాజాగా నిర్వహించిన అధ్యయంలో తేల్చారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచురించారు. బ్రూఫిన్ మందు వాడడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందని రిపోర్ట్ పేర్కొన్నది. సుమారు 31 మంది పురుషులపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరు వారాల పాటు రోజూ రెండు బ్రూఫిన్ టాబ్లెట్లు వాడితే.. ఈ సమస్య వస్తుందని ఆ కథనం వెల్లడించింది. 

న్యూరోఫెన్, అడ్విల్ పేర్లతో వస్తున్న బ్రూఫిన్ ట్యాబ్లెట్లతో ఈ సమస్య ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదీర్ఘ కాలం బ్రూఫిన్ వాడడం వల్ల పురుష వృణాలపై ప్రభావం ఉంటుందని, పునరుత్పత్తి హార్మోన్లు దెబ్బతింటున్నాయని స్టడీ వెల్లడించింది. బ్రూఫిన్ వాడకం వల్ల వృషణాల పనితీరు మందగిస్తుందని, దాని వల్ల ఆ వ్యక్తి టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేసేందుకు మరింత కష్టపడాల్సి వస్తుందని లండన్ ప్రొఫెసర్ అలీ అబ్బారా తెలిపారు. పురుష కణాలు తగ్గిపోవడమే కాకుండా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయన్నారు. అధికంగా బ్రూఫిన్ వాడితే వంధ్యత్వం కూడా వస్తుందని హెచ్చరించారు.