అగ్ని-1 మిస్సైల్‌ను పరీక్షించిన ఆర్మీ

అగ్ని-1 మిస్సైల్‌ను పరీక్షించిన ఆర్మీ

  బాలసోర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని బాలసోర్‌లో ఉన్న అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీన్ని పరీక్షించింది. మిస్సైల్ సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని-1లో ఇది 18వ వర్షెన్ కావడం విశేషం. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ మిస్సైల్‌ను 2004లో సర్వీసులోకి తీసుకువచ్చారు. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా ఈ మిస్సైల్‌ను పరీక్షించారు.

అతి తక్కువ సమయంలోనే ఈ మిస్సైల్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. లక్ష్యాన్ని అత్యంత పకడ్బందీగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 మిస్సైల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేంజ్, ఆక్యురెసీలో అగ్ని -1 అత్యుద్భత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయ్యి కిలోల పేలోడును మోసుకు వెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 మిస్సైల్‌ను 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు.