36 ఏళ్ల తర్వాత కపిల్‌దేవ్‌కు జీతం!

36 ఏళ్ల తర్వాత కపిల్‌దేవ్‌కు జీతం!

  న్యూఢిల్లీ: ఎక్కడైనా ఉద్యోగం చేస్తే  ఏ నెలకు ఆ నెల జీతం తీసుకుంటాం. కానీ, భారత్‌కు తొలి క్రికెట్‌ ప్రపంచకప్‌ అందించిన దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌ సుమారు మూడు దశాబ్దాల తర్వాత జీతం అందుకున్నాడు. 1978లో కపిల్‌దేవ్‌ భారత్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దానిలో భాగంగా మోదీ స్పిన్నింగ్‌ అండ్‌ వేవింగ్‌ కంపెనీ యాజమాన్యం 1979లో కపిల్‌దేవ్‌కు ఉద్యోగం ఇచ్చింది. 1979నుంచి 1982 వరకు కపిల్‌ ఆ సంస్థలోనే పనిచేశాడు. కానీ ఆ సమయంలో కపిల్‌దేవ్‌ తాను పని చేసినందుకు జీతం సరిగా అందుకోలేదట.

తాజాగా ఆ సంస్థ యాజమాన్యం దీనిపై స్పందించి అతనికి అందజేయాల్సిన రూ.2.75 లక్షలను కపిల్‌దేవ్‌ అకౌంట్‌కు జమచేసింది. కంపెనీ మేనేజర్‌ రాజేంద్ర శర్మ మాట్లాడుతూ... ‘1979లో కంపెనీ డైరెక్టర్‌, క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ వైకే మోదీ కోరిక మేరకు కపిల్‌ దేవ్‌.. మోదీ గ్రూప్‌లో పని చేశారు. సుమారు మూడేళ్లపాటు కపిల్‌దేవ్‌ పని చేశారు. కొన్ని నెలలకు మాత్రమే జీతం అందుకున్నారు. పీఎఫ్‌ కూడా అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా ఆ లెక్కలన్ని సెటిల్‌మెంట్‌ చేసి కపిల్‌దేవ్‌కు అందాల్సిన మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేశాం’ అని రాజేంద్ర తెలిపారు.