ఆరంభానికి ముందే ‘ఐపీఎల్’ ఆల్‌టైమ్ రికార్డు

ఆరంభానికి ముందే ‘ఐపీఎల్’ ఆల్‌టైమ్ రికార్డు

  న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్‌లీగ్(ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఆదరణ, వీక్షకులు, బ్రాండ్ పరంగా ఐపీఎల్ అగ్రస్థానంలో ఉంటుంది. ఐపీఎల్-11 సీజన్(2018) కోసం గత నెలలో రెండు రోజుల పాటు బెంగళూరులో నిర్వహించిన వేలం సైతం ఓ రికార్డు నమోదు చేయడం విశేషం.సాధారణంగా లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు ఆసక్తి చూపిస్తారు. 

ఈసారి మాత్రం అట్టహాసంగా ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయగా వేలం ప్రక్రియను 46.5 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఐదేళ్లపాటు లీగ్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ తొలిసారి వేలాన్ని ప్రసారం చేసింది. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో టెలికాస్ట్ చేసింది. బార్క్(బీఏఆర్‌సీ) వీక్షకుల డేటాను ఉటంకిస్తూ.. టీవీతో పాటు డిటిటల్ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఐదు రెట్లు పెరినట్లు స్టార్ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.