ఆసీస్‌ నూతన కోచ్‌గా లాంగర్‌

ఆసీస్‌ నూతన కోచ్‌గా లాంగర్‌

  సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ను నూతన కోచ్‌గా నియమించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఎ) గురువారం ప్రకటించింది. లాంగర్‌ టి20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించునున్నాడని తెలిపింది. 47 ఏళ్ల లాంగర్‌ నాలుగేళ్ల పాటు ఆసీస్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారని తెలిపింది. ఈనెల 22న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన నేతృత్వంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు రెండు యాషెస్‌ సిరీస్‌లతో పాటు వన్డే, టి20 ప్రపంచకప్‌లు ఆడనున్నట్లు సిఎ వివరించింది. ఈ సందర్భంగా లాంగర్‌ మాట్లాడుతూ.. 'ఆసీస్‌ జట్టుకు కోచ్‌గా నా సేవలు అందించంటానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. 

కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తాను. ప్రతిభ గల ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని, వారందరినీ ప్రోత్సహిస్తానని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా పనిచేస్తా' అని లాంగర్‌ అన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో కోచ్‌ పదవికి డార్‌నె లిమన్‌ రాజీనామా చేశాడు. ఇదే ఘటనలో కంగారు జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఓ ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల పాటు కంగారు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లాంగర్‌ 105 టెస్టులాడి 7,696 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి.