బిసిసిఐపై అభిమానుల ఆగ్రహం

బిసిసిఐపై అభిమానుల ఆగ్రహం

 భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో పాటు, బిసిసిఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తాజాగా బిసిసిఐ ఓ ఫొటోను పంచుకోవడమే. లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభం కానున్న దృష్ట్యా లండన్‌ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో కలిసి అనుష్క కూడా వెళ్లింది. కార్యాలయం ఎదుట అందరూ కలిసి దిగిన ఫొటోను బిసిసిఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు అనుష్కను చూసి అభిమానులు మండిపడ్డారు. 'అనుష్క టీమిండియాలో సభ్యురాలా? ఇది క్రికెట్‌ టూరా? లేక హనీమూన్‌ టూరా? ఇదేమీ ఫ్యామిలీ ఫంక్షన్‌ కాదు! జట్టు వైస్‌ కెప్టెన్‌ ఏమో ఆఖరి వరుసలో నిల్చుంటే.. అనుష్క ముందు వరుసలో ఉంది. ఆమె ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా' అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.