హాకీ మ్యాచ్‌లకు సర్దార్‌ గుడ్‌బై

హాకీ మ్యాచ్‌లకు సర్దార్‌ గుడ్‌బై

 న్యూఢిల్లీ : భారత హాకీజట్టు కెప్టెన్‌, సర్దార్‌సింగ్‌(32) అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు. బుధవారం ఈ మేరకు తన రాజీనామా లేఖను భారత హాకీ ఫెడరేషన్‌కు పంపించారు. ఈ సందర్భంగా సర్దార్‌ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా భారత హాకీ జట్టుకు సేవలందించిన యువకులకు ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో తాను రిటైరవుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఆసియా క్రీడల్లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కేవలం కాంస్య పతకం మాత్రమే గెల్చుకోగలిగింది. వయసురీత్యా యువకులతో సమంగా పరుగెత్తడంలో గానీ, పూర్తి ఫిట్‌నెస్‌ కొరవడడం కూడా ఒక కారణంగా తెలిపాడు. భారత హాకీ జట్టు సభ్యునిగా 12 ఏళ్ళు కొనసాగడం సామాన్యమైన విషయమేమీ కాదని... భావితరాలకు అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాను అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పినట్లు పిటిఐకు తెలిపారు. 

చండీఘర్‌కు చెందిన సర్దార్‌ పంజాబ్‌ నుంచి ఎక్కువమంది హాకీ ఆటగాళ్ళు భారతజట్టుకు ఎంపికవ్వడం గర్వకారణమన్నాడు. తాను తొలుత 2020 టోక్యో ఒలింపిక్స్‌ వరకు భారతజట్టులో కొనసాగాలని భావించినప్పటికీ ఫిట్‌నెస్‌ ముఖ్య కారణంగా తాను కొనసాగడం కష్టమని భావించాడు. సర్దార్‌ సీనియర్‌ జట్టు హాకీ సభ్యునిగా 2006లో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసి మిడ్‌ఫీల్డర్‌గా చాలాకాలం సేవలు అందించాడు. 32 ఏళ్ళ సింగ్‌ ఇప్పటివరకూ 350 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లను భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 2008లో కెప్టెన్‌గానూ ఎంపికై ఎనిమిదేళ్ళు బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అనంతరం భారత హాకీ ఫెడరేషన్‌ 2016లో శ్రీజేష్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. సర్దార్‌సింగ్‌ సారథ్యంలోని భారతజట్టు 2008లో సుల్తాన్‌ అజ్లాన్‌షా కప్‌ను గెలుచుకోగా... భారత ప్రభుత్వం 2012లో అర్జున్‌ అవార్డ్‌, 2015న పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. సర్దార్‌ భారత్‌ తరఫున రెండుసార్లు ఒలింపిక్స్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారతజట్టులో చోటు దక్కకపోయినా... ఛాంపియన్స్‌ ట్రోఫీలో జట్టు రజిత పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.