హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు

హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు

 మాస్కో : మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు సంబంధించి అందుబాటులో ఉంచిన 24 లక్షల టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో ఫిఫా, రష్యా ప్రభుత్వం మరో 10 లక్షల టికెట్లను ఫుట్‌బాల్‌ ప్రేమికుల సౌకర్యార్ధం అందుబాటులో ఉంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన 2.4 మిలియన్‌(సుమారు 24 లక్షలు) టిక్కెట్లన్నీ అమ్ముడైనట్లు తెలిపింది.

సెప్టెంంబర్‌ 2017 నుండి ఆ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా... ఇప్పటివరకు 24,03,116 టిక్కెట్లు అమ్ముడైపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం రష్యా అభిమానులే 8,71,797 టికెట్లు కొనుగోలు చేయగా... అమెరికా తరఫున 88,825, బ్రెజిల్‌ 72,512, కొలంబియా 65,234, జర్మనీ 62,541, మెక్సికో 60,302, అర్జంటీనా 54,031, పెరూ 43,583, చైనా 40,251, ఆస్ట్రేలియా 36,359 దేశాల అభిమానులు కొనుగోలు చేయగా. ఇంగ్లండ్‌లో 32,362 టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఫిఫా మరో 10 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్లు ఖీ×ఖీA.షశీఎ/్‌ఱషసవ్‌ర ద్వారా శనివారం ఉదయం నుండి పొందవచ్చని తెలియజేశారు. 

ఇక గ్రూప్‌-సి విషయానికొస్తే... ఈ గ్రూప్‌లో ప్రధానంగా అర్జంటీనా జట్టు బలమైనది. ఆ జట్టు 1978, 1986లలో రెండుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతేగాక ప్రస్తుత ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్రధాన స్ట్రయికర్‌, జట్టు సారథి లియెనెల్‌ మెస్సీ ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ప్రపంచకప్‌కు అర్జంటీనా ప్రకటించిన జట్టులో ఉన్న ముగ్గురు గోల్‌కీపర్లు గుజ్‌మన్‌, ఫ్రాన్కో, కబల్యిరోలు సీనియర్‌ ఆటగాళ్లు. ఫార్వర్డ్‌ ఆటగాళ్లుగా మెస్సీతోపాటు హిగోయిన్‌, అగియోరో, డైబలా రాణించనున్నారు. గత ప్రపంచకప్‌లో అర్జంటీనా జట్టు సెమీఫైనల్లో ఓడింది.

సెమీస్‌లో నెదర్లాండ్‌ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో 2-4 గోల్స్‌ తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈసారి అన్నీ అనుకూలిస్తే ఆజట్టు టైటిల్‌ గెలవడం ఖాయం. అర్జంటీనా తర్వాత ఈ గ్రూప్‌లో బలమైన జట్టు నైజీరియా... క్రొయేషియా కూడా బలమైన జట్టే అయినా ఐస్‌లాండ్‌తో పోల్చి చూస్తే పై మూడు జట్లు నాకౌట్‌కు చేరగల జట్లు. గత ప్రపంచకప్‌లో క్రొయోషియా జట్టు గ్రూప్‌-ఎలో బ్రెజిల్‌, మెక్సికో చేతిలో ఓడి.. కెమెరూన్‌పై 4-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. లీగ్‌ దశలో మూడోస్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరలేకపోయింది. ఇక నైజీరియా విషయానికొస్తే ఆ జట్టు గత ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరి ప్రీక్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్‌ చేతిలో 0-2 గోల్స్‌ తేడాతో ఓటమిపాలై టోర్నీనుండి నిష్క్రమించింది.