కోహ్లీ వ్యాఖ్య‌ల‌పై..నెటిజ‌న్ల ఆగ్ర‌హం

కోహ్లీ వ్యాఖ్య‌ల‌పై..నెటిజ‌న్ల ఆగ్ర‌హం

   టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఓ అభిమానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. కోహ్లీ ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. విరాట్‌ను ‘ఓవర్ రేటెడ్ ప్లేయర్’ అని వ్యాఖ్యానించాడు. అందరూ చెబుతున్న ప్రత్యేకత కోహ్లీలో తనకు కనిపించదని, భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ ఎంతో బాగుంటుందని పేర్కొన్నాడు. 

 అతడి వ్యాఖ్యలతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది.  భారత క్రికెటర్ల ఆట నచ్చనప్పుడు ఇండియాలో ఉండడానికి నీకు అర్హత లేదంటూ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్లు. వేరే దేశాలను ప్రేమిస్తూ ఇక్కడ ఎందుకు ఉండడం?  మీరు నన్ను ఇష్టపడకున్నా నాకొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇక్కడే ఉంటూ వేరే దేశాన్ని పొగడడం నాకు ఇష్టం ఉండదు’’ అని అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.     

కోహ్లీ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. వ్యక్తిగత అభిప్రాయం చెప్పిన అభిమానిపై ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు విదేశీ దుస్తులు ధరించొచ్చు, విదేశాల్లో పెళ్లి చేసుకోవచ్చు, విదేశాల్లో పెళ్లి చేసుకున్నప్పుడు కనిపించని తప్పు విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే వచ్చిందా? అంటూ విరుచుకుపడుతున్నారు. విదేశీ క్రికెటర్లను ఇష్టపడినంత మాత్రాన దేశం విడిచి వెళ్లిపోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.