‘మళ్లీ వన్డే జట్టులోకి వస్తా’

‘మళ్లీ వన్డే జట్టులోకి వస్తా’

 భువనేశ్వర్‌ : వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లోగా జట్టులో చోటు దక్కించు కుంటానని టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ధీమా వ్యక్తం చేశాడు. కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరమైన రహానే స్పిన్‌ బౌలింగ్‌ ఎదుర్కొవడానికి దేశవాళీ టోర్నీలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒడిశాలో క్రికెట్‌కు సంబంధిం చిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రహానె మీడియాతో మాట్లాడుతూ.. నా టెక్నిక్‌లో ఎలాంటి సమస్య లేదు. అసలు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థి తుల్లో నేను సాధిస్తున్న 30, 40 పరుగులనే అర్ధశతకాలు.. శతకాలుగా మార్చాల నుకుంటున్నాను. కొన్ని సార్లు అద్భుతంగా ఆడాలనుకున్నా.. ఫలితం మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఈ క్రమంలోనే స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై కసరత్తులు చేస్తున్నా. 

ఇప్పటికే ఈ విషయంలో చాలా మెరుగయ్యాను. దీనికోసమే దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నానని తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులకు జట్టులో చోటు దక్కకపోవడంపై మాట్లాడుతూ ఆ విషయం గురించి నేనేమీ బాధపడలేదు. జట్టు ఎంపిక విషయం మన చేతుల్లో ఉండదు. వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచించాను. యో యో ఫిట్‌నెస్‌ టెస్టుతో ఎలాంటి సమస్య లేదని.. ఆటగాళ్లలో పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ ఉంటేనే అది జట్టు విజయానికి తోడ్పడుతుందని పేర్కొన్నాడు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఆసీస్‌ పర్యటనకు పది రోజుల ముందుగానే అక్కడికి వెళుతున్నామని తెలిపాడు. 'ఏ జట్టునైనా వారి సొంతగడ్డపై ఓడించడం కాస్త కష్టమే. దీనికితోడు ఆసీస్‌ బౌలింగ్‌ విభాగం అద్భుతంగా ఉంది. అయితే మన బౌలర్లు కూడా అదే స్థాయిలో సత్తా చాటుతున్నారు' అని అన్నాడు.