నాకు పాకిస్థానే అన్నీ...

నాకు పాకిస్థానే అన్నీ...

  ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై మాట్లాడి ఇండియన్ క్రికెటర్ల ఆగ్రహానికి గురైన పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది విమర్శలపై స్పందించాడు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, వాస్తవాలు చెప్పకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని అన్నాడు. నా ట్వీట్‌పై ఎవరెలా స్పందించారన్నది నాకు అనవసరం. నేను వాస్తవం చెప్పానన్న విశ్వాసం నాకుంది. ఆ హక్కు కూడా నాకుంది అని అఫ్రిది అన్నట్లు పాక్ పాషన్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. ఐపీఎల్‌లో ఆడాల్సిందిగా వాళ్లు పిలిచినా నేను వెళ్లను. పాకిస్థాన్ సూపర్ లీగే గొప్పది. అది ఎప్పుడో ఒకసారి ఐపీఎల్‌ను మించిపోతుంది. పీఎస్‌ఎల్‌లో ఆడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఐపీఎల్‌తో నాకు పనిలేదు అని అఫ్రిది స్పష్టంచేశాడు.

నేను నా దేశానికి సైనికుడిని. నా దేశమే నా గౌరవం. పాకిస్థానే నాకు అన్నీ. నేను క్రికెటర్ కాకపోయి ఉంటే.. ఆర్మీలో చేరేవాడిని అని అఫ్రిది అన్నాడు. మేం అందరినీ గౌరవిస్తాం. ఓ క్రీడాకారుడిగా ఇది సహజం. మానవ హక్కుల విషయానికి వచ్చినపుడు అమాయకులైన కశ్మీరీలకూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తాం అని అఫ్రిది చెప్పాడు. కశ్మీర్ అంశంపై అతను చేసిన ట్వీట్‌పై ఇండియన్ క్రికెటర్లు కపిల్‌దేవ్, సచిన్, కోహ్లి, రైనా, గంభీర్, ధావన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.