పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు

పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు

 ముంబై: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీసీసీఐ వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఇద్దరికీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో క్షమాపణ కూడా చెప్పాడు. 

రాహుల్ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఈ ఇద్దరు క్రికెటర్లు తమకు యువతులతో ఉన్న సంబంధాలను పబ్లిగ్గా చెప్పారు. తన పేరెంట్స్‌తో తాను ఎంతో సన్నిహితంగా ఉంటానని, తాను కలిసి అమ్మాయిల సంగతి కూడా తాను వాళ్లతో షేర్ చేసుకున్నానని పాండ్యా చెప్పాడు. దీనిపై విమర్శలు రావడంతో అతడు సారీ చెప్పాడు. అయితే అసలు క్రికెటర్లు ఇలాంటి క్రికెట్‌తో సంబంధం లేని షోలలో ఎందుకు పాల్గొంటున్నారన్నదానిపై బోర్డు దృష్టి సారించింది. ఇలాంటి షోలలో పాల్గొనకుండా క్రికెటర్లపై నిషేధం విధించే అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తున్నది.