ప్రపంచకప్‌లో సందడి చేయనున్న భారత్‌ అభిమానులు

ప్రపంచకప్‌లో సందడి చేయనున్న భారత్‌ అభిమానులు

  మాస్కో: మరికొన్ని రోజుల్లోనే ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కప్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు పాల్గొనలేకపోవచ్చు. కానీ, భారత ఫుట్‌బాల్‌ అభిమానులు మాత్రం ఈ ప్రపంచకప్‌లో సందడి చేయనున్నారు. ఈ టోర్ని టిక్కెట్లను రష్యా విక్రయించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ టిక్కెట్లలో సగానికి పైగా అంటే 54 శాతం టిక్కెట్లను విదేశీ అభిమానులకు రష్యా కేటాయించింది. వీటిలో 17, 962 టిక్కెట్లను భారత ఫుట్‌బాల్‌ అభిమానులు దక్కించుకున్నట్లు రష్యా తెలిపింది. టిక్కెట్ల అమ్మకాల్లో భారత్‌ టాప్‌-20లో ఉందని ఫిఫా ప్రపంచకప్‌ అధికారి ప్రతినిధి తెలిపారు. ఆతిథ్య రష్యాలో ఇప్పటి వరకూ 8,72,578 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్ల అమ్మకాల్లో రష్యా తొలిస్థానంలో ఉంది. రెండో స్థానంలో అమెరికా ఉంది.

అమెరికాలో ఇప్పటి వరకూ 86,710 టిక్కెట్ల అమ్మకాలు జరిగాయి. చైనాలో 39, 884 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో అమెరికా, చైనాలు విఫలం చెందినా, ఈ దేశాల్లో టిక్కెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఫిఫా అధికారులు తెలిపారు. ఈ దేశాల బాటలోనే భారత్‌లోనూ టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. దేశంలో ముఖ్యంగా గోవాలో టిక్కెట్లు అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో ఏప్రిల్‌ 18న చివరి దశ టిక్కెట్లు అమ్మకాలు ప్రారంభించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,905 టికెట్ల అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర సంఘాలకు కేటాయించిన టిక్కెట్లు అన్ని వేగంగా అమ్ముడుపోతున్నాయని భారత్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు చెందిన అధికారి కిషోర్‌ తైడ్‌ తెలిపారు.