స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం

స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం

 న్యూఢిల్లీ: భారత క్రీడాచరిత్రలో మరో సంచలనం. స్కీయింగ్‌లో ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘన చరిత్రను హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్ ఆంచల్ ఠాకూర్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్కీయింగ్ సమాఖ్య (ఎఫ్‌ఐఎస్) ఆధ్వర్యంలో టర్కీలో జరిగిన ప్రతిష్టాత్మక అల్‌పైన్ ఎజ్డెర్ 3200 టోర్నీలో ఆంచల్ కాంస్య పతకం గెలిచింది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన స్లాలోమ్ రేసులో 21 ఏండ్ల ఆంచల్ మూడోస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్కీయింగ్ ఈవెంట్లలో భారత్‌కు ఇది తొలి పతకం కావడం విశేషం. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా రికార్డులకెక్కిన ఆంచల్.. వింటర్ ఒలింపిక్స్‌కు ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అంతర్జాతీయస్థాయిలో తొలి పతకం అందుకున్నందుకు ఈ మనాలీ అమ్మాయి సంతోషం వ్యక్తం చేసింది.