వార్నర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?

వార్నర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?

  సిడ్నీ:  బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటనలో తాను ఎంతగానో చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ క్రికెట్‌ ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. తాను ఎంతో ప్రేమించే క్రికెట్‌పై తన చర్య మాయని మచ్చగా అభివర్ణించాడు.  తామ చేసిన తప్పిదాలు క్రికెట్‌ ప్రతిష్ఠను దెబ్బతీశాయని వార్నర్‌ అంగీకరించాడు.అయితే ప్రస్తుతం వార్నర్‌ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఏడాది నిషేధం విధించడంతో పాటు శాశ్వతంగా ఆసీస్‌ పగ్గాలు చేపట్టకుండా సీఏ(క్రికెట్‌ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. 

స్మిత్‌పై ఏడాది నిషేధం మాత్రమే విధించిన సీఏ.. వార్నర్‌పై మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఒకే వ్యవహారంలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లపై వేర్వేరుగా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఎందుకిలా నిర‍్ణయం తీసుకుందో సగటు అభిమానికి ఓ పజిల్‌లా మారిపోయింది. ఈ ఘటనలో తన పాత్ర ఉందంటూ కెప్టెన్‌ స్మిత్‌ అంగీకరించినప్పటికీ, వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌నే టార్గెట్‌ చేసినట్లు కనబడింది. స్మిత్‌కు ఏడాది పాటు కెప్టెన్సీకి దూరం పెడతామని చెప్పిన సీఏ.. వార్నర్‌ను శాశ్వతంగా సారథ్య బాధ్యతలకు చేపట్టుకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది.

ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో ఆసీస్‌ క్రికెటర్ల కాంట్రాక్ట్‌లో భాగంగా జీతాల విషయంలో సీఏతో తీవ్రంగా పోరాడటమే వార్నర్‌కు శాపంగా మారినట్లు కనబడుతోంది. ఆటగాళ్లందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సీఏను దిగివచ్చేలా చేశాడు వార్నర్‌. ఆసీస్‌ పగ్గాలను భవిష్యత‍్తులో వార్నర్‌ చేపట్టకుండా సీఏ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణమనేది క్రికెట్‌ ప్రేమికుల భావన.