ఆఖర్లో వదిలేశారు..!

ఆఖర్లో వదిలేశారు..!

  భువనేశ్వర్‌ : ఆరంభ నిమిషాల్లో పొజిషన్లలో కుదరుకునేలోపు ప్రత్యర్థి ఎదురుదాడి, ఆట ముగుస్తుందనగా ఆఖరి నిమిషాల్లో ప్రత్యర్థి మెరుపు దాడి గ్రూప్‌-సిలో భారత్‌కు రెండో విజయాన్ని దూరం చేసింది. వరల్డ్‌ నం.3, ఒలింపిక్‌ మెడలిస్ట్‌ బెల్జియంతో మ్యాచ్‌ను భారత్‌ 2-2తో సమం చేసుకున్నది. అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ 8వ నిమిషం గోల్‌తో తొలి రెండు క్వార్టర్లలో బెల్జియం ముందంజ వేసింది. కానీ 39, 47వ నిమిషాల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సిమ్రన్‌జిత్‌ సింగ్‌ల గోల్స్‌తో భారత్‌ ఆఖరి క్వార్టర్‌కు ముందు 2-1తో ఆధిక్యం సాధించింది. 

మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్‌ మన వశం అవుతుందని అనుకోగా.. గోల్‌కీపర్‌ పొజిషన్‌ మార్చి అదనపు ఎటాకర్‌తో మెరుపు దాడి చేసిన బెల్జియం స్కోరు సమం చేసింది. బెల్జియం మూడు పెనాల్టీ కార్నర్లను అడ్డుకున్న గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ 56వ నిమిషంలో సైమన్‌ గోల్‌ ప్రయత్నాన్ని అడ్డుకోలెకపోయాడు. దీంతో బెల్జియం, భారత్‌ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. గ్రూప్‌-సి మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, కెనడా సైతం 1-1తో డ్రా చేసుకున్నాయి. భారత్‌ గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌ను డిసెంబర్‌ 8న కెనడాతో ఆడనున్నది. ప్రస్తుతం కొట్టిన గోల్స్‌ వ్యత్యాసంతో గ్రూప్‌-సిలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.