భారత్‌ను గెలిపించిన సింధు

భారత్‌ను గెలిపించిన సింధు

 అలోర్ సీటెర్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-2తో హాంకాంగ్‌పై గెలిచింది. పీవీ సింధు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి సింగిల్స్ ఆడిన సింధు 21-12, 21-18 యిప్ పీ యిన్ (హాంకాంగ్)పై నెగ్గి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. గతవారం ఇండియా ఓపెన్ ఫైనల్లో పరాజయం పాలైన ఈ తెలుగమ్మాయి.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదురగొట్టింది. మహిళల డబుల్స్‌లో అశ్విని-ప్రజక్తా సావంత్ జోడీ 22-20, 20-22, 10-21తో వింగ్ యుంగ్-యింగ్ టింగ్ చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ దశలో రెండో సింగిల్స్ ఆడిన శ్రీ కృష్ణప్రియా 19-21, 21-18, 20-22తో చియాంగ్ యింగ్ మి చేతిలో ఓడటంతో భారత్ 1-2తో వెనుకబడింది. నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో సింధు.. సిక్కీ రెడ్డితో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగింది. 


హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ద్వయం 21-15, 15-21, 21-14తో ఎంగ్ సెజ్ యు-యిన్ సిన్ యింగ్‌పై గెలిచి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌లో రుత్విక శివాని గద్దె 16-21, 21-16, 21-13తో యింగ్ సుమ్ యీని ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌ను చేజార్చుకున్న శివాని.. మిగతా రెండింటిలో అద్భుతంగా పోరాడింది. ఈనెల 20 నుంచి జరిగే ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు ఆసియా చాంపియన్‌షిప్‌ను అర్హత టోర్నీగా భావిస్తారు. పురుషుల విభాగంలో భారత్ 5-0తో ఫిలిప్పీన్స్‌పై గెలిచింది. తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-11, 21-12తో లియోనార్డ్ పెడ్రోసాపై, డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి 21-15, 21-13తో ఆంటోని కెయానన్-ఫిలిప్ జోపెర్‌పై, రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-16, 21-10తో ఆర్థర్ సామ్యూల్‌పై, రెండో డబుల్స్‌లో అర్జున్-రామచంద్రన్ 21-18, 21-17తో సీటర్ గాబ్రియెల్-అల్విన్ మరోడాపై, మూడో సింగిల్స్‌లో సమీర్ వర్మ 21-15, 21-12తో లాంజ్ రాల్ఫ్‌పై గెలిచి క్లీన్‌స్వీప్ చేశారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో భారత్.. మాల్దీవ్స్‌తో తలపడుతుంది.