ఛెత్రీ సేనకు చావో రేవో

ఛెత్రీ సేనకు చావో రేవో

 అబుదాబి : భారత ఫుట్‌బాల్‌ జట్టు నేడు బహ్రెయిన్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఎఎఫ్‌టి ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా భారతజట్టు గ్రూప్‌-ఏలో మూడు పాయింట్లతో థారులాండ్‌తో సమంగా రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లోనే ఉన్న ఆతిథ్య యుఏఈ జట్టు నాలుగు పాయింట్ల అగ్రస్థానంలో ఉంది. సోమవారం జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లలో రెండోస్థానంలో భారతజట్టు ఒక పాయింట్‌తో నాల్గోస్థానంలో ఉన్న బహ్రెయిన్‌తో ఆఖరిలీగ్‌ మ్యాచ్‌లో తలపడనుంది. నేడు జరిగే మరో మ్యాచ్‌లో యుఏఈ జట్టు థారులాండ్‌తో తలపడనుంది. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు బహ్రెయిన్‌పై గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా తొలిసారి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించనుంది. 97వ ర్యాంక్‌ భారతజట్టు 113వ ర్యాంక్‌లో ఉన్న బహ్రెయిన్‌పై సునాయాసంగా గెలిచే అవకాశముంది. బహ్రెయిన్‌ జట్టు తొలిమ్యాచ్‌లో ఆతిథ్య యుఏఈతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కానీ ఆ తర్వాత థారులాండ్‌ చేతిలో అనూహ్యంగా 0-1తో ఓడింది. దీంతో ఆ జట్టు కూడా నాకౌట్‌కు చేరాలంటే సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే ముందుకెళ్లనుంది. 

ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ చరిత్రలో భారతజట్టు 1984 నుంచి 2011 మధ్యకాలంలో ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరలేదు. కానీ 1964 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. కానీ అప్పుడు రౌండ్‌ రాబిన్‌లీగ్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరిగాయి. కేవలం నాలుగు దేశాల జట్లు మాత్రమే ఆ టోర్నీలో బరిలోకి దిగాయి. కానీ ఈసారి జరిగే ఎఎఫ్‌సి ఆసియాకప్‌ టోర్నీలో అత్యధికంగా 24 జట్లు పాల్గొంటున్నాయి. 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండుజట్లు నేరుగా ప్రి క్వార్టర్స్‌కు చేరతాయి. అలాగే ఆయా గ్రూపుల్లో గోల్స్‌, పాయింట్ల పరంగా మూడోస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నాకౌట్‌ దశకు చేరడానికి మరో మ్యాచ్‌ ఆడేందుకు అవకాశముంది.

ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మ్యాచ్‌ డ్రా అయిన పక్షంలో గోల్స్‌ అంతరం, ముఖాముఖి పోటీలో గెలిచిన జట్టు ముందుకు వెళ్తుంది. సోమవారం జరిగే పోటీల్లో భారత్‌-థాయ్‌లాండ్‌ జట్లు ఓడిన పక్షంలో టోర్నీనుంచి నిష్క్రమించే ప్రమాద ముంది. కోచ్‌ స్టెఫెన్‌ మాట్లాడుతూ భారతజట్టు 2011 ఆసియాకప్‌లో బహ్రెయిన్‌ చేతిలో 2-5 గోల్స్‌తో పరాజయంపాలైందని, కానీ ఈసారి ఛెత్రీసేన తప్పక గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌ను ఛెత్రీ సేన కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్‌కు చేరే అవకాశముంది. థారులాండ్‌ చివరిమ్యాచ్‌లో పటిష్ట యుఏఈతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌-థారు జట్లు నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలుస్తాయి.

ముఖాముఖి పోటీలో భారతజట్టు 4-1తో థారులాండ్‌ను ఓడించడంతో గ్రూప్‌-ఏ నుంచి ప్రి క్వార్టర్‌ఫైనల్‌కు ఛెత్రీసేన అర్హత సాధించేఅవకాశముంది. భారతజట్టు తరఫున సునీల్‌ ఛెత్రీ ప్రాతినిధ్యం వహించడం ద్వారా మాజీ సారథి బైచుంగ్‌ భూటియా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన(107) రికార్డుకు చేరుకుంటాడు. థారులాండ్‌, యుఏఈతో మ్యాచ్‌ల సందర్భంగా బరిలోకి దిగిన 4-4-2 పొజిషన్‌లోనే ఆఖరి మ్యాచ్‌లోనూ మైదానంలోకి దిగుతామని కోచ్‌ స్టీఫెన్‌ తెలిపారు.