కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

 గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా శనివారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ మరో స్వర్ణం కొల్లగొట్టింది. పురుషుల 77 కేజీల విభాగంలో మొత్తం 317 కేజీలు ఎత్తి సతీశ్‌కుమార్ శివలింగం స్వర్ణం కైవసం చేసుకున్నాడు. పురుషుల 77 కిలోల విభాగంలో పోటీపడిన అతను స్నాచ్‌లో 144, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 173 కిలోలు ఎత్తాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రత్యర్థి లిఫ్టర్ జాక్ ఆలీవర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. అతడు క్లీన్ అండ్ జెర్క్ రౌండ్ తరువాత రెండో స్థానంలో నిలిచాడు. మూడో రోజు గేమ్స్‌లో భారత్ మూడో పసిడి పతకం సాధించింది. దీంతో మొత్తం భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు వచ్చిన పతకాలన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌లో రావడం విశేషం. మహిళా లిఫ్టర్లు మీరాబాయ్ చాను స్వర్ణం, సంజిత చాను పసిడి, పురుషుల్లో 18ఏళ్ల దీపక్ లాటెర్ కాంస్యం, గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. 

 

 వేకువజామున భారతీయులకు మరో గిఫ్ట్ వచ్చింది. రోజు(శనివారం)ను గొప్పగా ఆరంభించారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో స్వర్ణం సాధించిన సతీశ్ శివలింగానికి అభినందనలు. తొడకండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ గొప్పగా ప్రయత్నించావు. గ్లాస్గో గేమ్స్‌లో తొలిసారి స్వర్ణం గెలిచిన సతీశ్‌కు ఇది వరుసగా రెండో బంగారు పతకం అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ ద్వారా ప్రశంసించాడు. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్ట‌ర్లు ప‌త‌కాలు సాధించ‌డంప‌ట్ల భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వెయిట్‌లిఫ్ట‌ర్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. స్వ‌ర్ణం సాధించిన స‌తీశ్‌కుమార్‌కు ట్విట‌ర్‌లో అభినంద‌న‌లు తెలిపారు.