ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో ముస్కాన్‌కు స్వర్ణం

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో ముస్కాన్‌కు స్వర్ణం

  సిడ్నీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ల గురి అదురుతున్నది. తాజాగా బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏండ్ల ముస్కాన్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో భారత అమ్మాయి 35 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇది నాలుగో పసిడి. హోరాహోరీగా సాగిన ఫైనల్ షూట్‌లో ముస్కాన్ ఆరో రౌండ్‌లో 5/5 స్కోరు సాధించి ఆధిక్యంలోకి వచ్చి చివరి వరకు దానిని కాపాడుకుంది. చైనాకు చెందిన క్విన్ షియాంగ్ (34)కు రజతం, కన్యాకోర్న్ హిరున్‌పోయెమ్ (థాయ్‌లాండ్)కు కాంస్యం దక్కాయి. మను బాకర్ 18 పాయింట్లతో నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. టీమ్ విభాగంలో ముస్కాన్, మను బాకర్, దేవాన్షి రానా బృందం కూడా పసిడిని సొంతం చేసుకుంది. ఇదే క్యాటగిరీలో గౌర్, మహిమ తుర్హి అగర్వాల్, తను రావల్‌కు రజతం లభించింది. పురుషుల స్కీట్‌లో అనంత్‌జిత్ సింగ్ నరుకా, ఆయూష్ రుద్రరాజ్, గుర్నిలాల్ సింగ్ 348 పాయింట్లతో రతజంతో మెరిశారు. వ్యక్తిగత విభాగంలో నరుకా ఐదోస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో భారత్ (9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలు) మొత్తం 22 పతకాలతో రెండో స్థానంలో ఉండగా, చైనా 9 స్వర్ణాలతో టాప్‌లో కొనసాగుతున్నది.