పంకజ్‌కు 17వ ప్రపంచ టైటిల్

పంకజ్‌కు 17వ ప్రపంచ టైటిల్

 దోహా: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ప్రత్యర్థుల కండ్లు కుట్టేలా వరల్డ్ టైటిళ్లు ఇంత సులువా అన్న రీతిలో పంకజ్..మరోమారు తన సత్తా ఏంటో ఘనంగా చాటిచెప్పాడు. ఆదివారం జరిగిన ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ 150-అప్ ఫార్మాట్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) తేడాతో మైక్ రస్సెల్(ఇంగ్లండ్)పై గెలిచాడు. బెస్ట్‌ఆఫ్-11 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ అద్వానీ..తొలి ఫ్రేమ్‌ను ప్రత్యర్థి రస్సెల్‌కు చేజార్చుకుని కొంత తడబడ్డాడు. 

ఆ తర్వాత రెండో ఫ్రేమ్‌ను 150-128తో దక్కించుకుని పోటీలోకి వచ్చినా..మూడోది చేజారింది. ఇక్కణ్నుంచి తన ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చిన పంకజ్.. వరుస సెట్లలో భారీ తేడాతో పాయింట్లు కొల్లగొడుతూ రస్సెల్‌కు చెక్‌పెట్టాడు. ఇంగ్లండ్ క్యూయిస్టుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లను దక్కించుకున్నాడు.దీని ద్వారా ఏ క్రీడలోనైనా అత్యధిక ప్రపంచ టైటిళ్లు గెలిచిన తొలి భారత ఆటగానిగా పంకజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.