పారా ఆసియన్‌ గేమ్స్‌లో మరో స్వర్ణం

పారా ఆసియన్‌ గేమ్స్‌లో మరో స్వర్ణం

 జకార్తా : పారా ఆసియన్‌ గేమ్స్‌లో బుధవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. ఆర్చరీ రికర్వ్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో హర్వీందర్‌ సింగ్‌ తొలిసారి భారత్‌కు స్వర్ణాన్ని సంపాదించిపెట్టాడు. ఫైనల్లో హర్వీందర్‌ సింగ్‌ 6-0 పాయింట్ల తేడాతో చైనాకు చెందిన జో-లిక్సోపై గెలుపొందాడు. డబ్ల్యూ2/ఎస్‌టి కేటగిరీలో పోటీపడి భారత్‌కు ఏడో స్వర్ణాన్ని సంపాదించిపెట్టాడు. పారా గేమ్స్‌లో భారత్‌కు ఐదోరోజు మూడు రజిత, నాలుగు కాంస్య పతకాలు కూడా దక్కాయి. పురుషుల లాంగ్‌జంప్‌లో విజరుకుమార్‌, డిస్కస్‌ త్రోలో మోనూ ఘంగాస్‌, లాంగ్‌ జంప్‌లో విజరుకుమార్‌లు రజిత పతకాలను గెల్చుకున్నారు. పవర్‌లిఫ్టింగ్‌లో సుధీర్‌ 80 కిలోల విభాగంలో 192 కిలోల బరువును ఎత్తి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు. ఐదోరోజు భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. దీంతో భారత్‌ పారా ఆసియా గేమ్స్‌లో ఇప్పటివరకూ 7 స్వర్ణ, 13 రజిత, 17 కాంస్య పతకాలతో సహా మొత్తం 37 పతకాలు గెల్చుకుంది. 100 స్వర్ణాలతో చైనా అగ్రస్థానంలో, 35 స్వర్ణాలతో దక్షిణ కొరియా రెండోస్థానంలో ఉన్నాయి.