ప్రపంచ ర్యాంకింగ్స్‌లో  మేరీ కోమ్‌ అగ్రస్థానం

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో  మేరీ కోమ్‌ అగ్రస్థానం

 న్యూఢిల్లీ : సీనియర్‌ మహిళా బాక్సర్‌ మేరీ కోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ (ఏఐబిఏ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది నవంబర్‌లో నూఢిల్లీ వేదికగా జరిగిన ఏఐబీఏ మహిళా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ఫిప్‌ 48 కేజీల విభాగంలో మేరీ స్వర్ణంతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దీంతో మేరీ ప్రపంచ బాక్సింగ్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను ఆరుసార్లు గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 48 కేజీల విభాగంలో 1700 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అంతేగాక 2020లో జరగబోయే ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగాన్ని చేర్చని కారణంగా మేరీ 51కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది. 

2018 మేరీకోమ్‌కు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. 51కేజీల విభాగంలో పింకీ జంగ్రా ఎనిమిదో స్థానంలో నిలవగా, ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మనీషా మాన్‌ 54 కేజీల విభాగంలో ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకుంది. 57 కేజీల విభా గంలో సోనియా లాథర్‌ రెండో స్థానంలో నిలిచింది. మరో బాక్సర్‌ సిమ్రంజిత్‌ కౌర్‌ 64 కేజీల విభాగంలో నాలుగోస్థానానికి చేరింది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఎల్‌ సరితా దేవి 16 స్థానానికే పరిమితమైంది. ఇండియా ఓపెన్‌లో స్వర్ణాన్ని ముద్దాడిన లవ్లీనా 69కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది.