ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్ విజేత బెంగళూరు ర్యాప్టర్స్‌

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్ విజేత బెంగళూరు ర్యాప్టర్స్‌

  బెంగళూరు : ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాల్గో సీజన్‌ విజేతగా బెంగళూరు ర్యాప్టర్స్‌ జట్టు అవతరించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోటీలో బెంగళూరు ర్యాప్టర్స్‌ జట్టు ముంబయి రాకెట్స్‌ను 4-3తో ఓడించి టైటిల్‌ విజేతగా నిలిచింది. ముంబయి ట్రంప్‌ మ్యాచ్‌గా తీసుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జంగ్‌- బెర్నాండెత్‌ జోడీ 15-8, 15-14 పాయింట్ల తేడాతో ఎల్లీస్‌-స్మిత్‌ (బెంగళూరు) ను ఓడించి 2-0 ఆధిక్యతను సాధించింది. 

ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌(బెంగళూరు) 15-7, 15-10తో అంటోన్సెన్‌ను ఓడించి ముంబయి ఆధిక్యతను 1-2కు తగ్గించాడు. బెంగళూరు ట్రంప్‌ మ్యాచ్‌గా తీసుకున్న మహిళల సింగిల్స్‌లో టిటి వూ 15-8, 15-9తో పర్‌దేశీ (ముంబయి) పై గెలిచి 3-1 ఆధిక్యతలో బెంగళూరు నిలిచింది. రెండో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో సమీర్‌వర్మ(ముంబయి) 7-15, 15-12, 15-3 పాయింట్ల తేడాతో సాయిప్రణీత్‌(బెంగళూరు)ను ఓడించి 3-3తో సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక పురుషుల డబుల్స్‌ ఆఖరి మ్యాచ్‌లో అహసన్‌-సాతివాన్‌(బెంగళూరు) జోడీ 15-13, 15-10 పాయింట్ల తేడాతో జంగ్‌-డియో(ముంబయి)ను ఓడించి 4-3తో బెంగళూరుకు టైటిల్‌ను సంపాదించిపెట్టారు.