ప్రొ కబడ్డీ లీగ్‌లో రిషాంక్ రికార్డు

ప్రొ కబడ్డీ లీగ్‌లో రిషాంక్ రికార్డు

  జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ ఆటగాడు రిషాంక్ దేవడిగ రికార్డు సృష్టించాడు. గురువారం జైపూర్ పింక్‌పాంథర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషాంక్ ఒక్కడే 28 పాయింట్లు సాధించి యూపీ జట్టు భారీ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే రిషాంక్ దీటుగా విజృంభించడంతో యూపీ జట్టు 53-32 భారీ స్కోరు తేడాతో జైపూర్‌ను చిత్తుచేసింది. ఓ మ్యాచ్‌లో ఆటగాడు అత్యధికంగా 28 పాయింట్లు సాధించడం కబడ్డీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. 

రిషాంక్ రైడింగ్‌లో ఈ పాయింట్లు సాధించాడు. అంతేకాదు, ఈ విజయంతో యూపీ జట్టు కూడా ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన తొలి జట్టుగా యూపీ నిలిచింది. జైపూర్ తరఫున అత్యధికంగా తుషార్ పాటిల్ 8 పాయింట్లు గెలిచాడు. ఈ విజయంతో యూపీ యోధ జట్టు జోన్-ఎ నుంచి మూడోస్థానంలో నిలిచి సూపర్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. జైపూర్ జట్టు జోన్ బి నుంచి ఐదోస్థానంలో కొనసాగుతున్నది.