రజతంతో మెరిసిన అంజుమ్ ప్రపంచకప్ షూటింగ్

రజతంతో మెరిసిన అంజుమ్ ప్రపంచకప్ షూటింగ్

  న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు శుక్రవారం మరో పతకం లభించింది. మెక్సికోలో జరుగుతున్న టోర్నీలో భారత షూటర్ అంజుమ్ మౌద్గిల్ 50 మీటర్ల పిస్టల్(3 పొజిషన్)లో రజతం సాధించి తద్వారా ప్రపంచకప్‌లో తొలి పతకం సాధించింది. తీవ్రమైన గాలులతో వాతావరణం ఇబ్బంది కలిగించినా 454.2 పాయింట్లు నమోదు చేసిన అంజుమ్ పతకం సాధించడం విశేషం. ఈ విభాగంలో చైనాకు చెందిన జూనియర్ ప్రపంచకప్ చాంపియన్ రుజియావో 455.4 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా..చైనాకే చెందిన టింగ్ సున్ 442.2 పాయింట్లతో కాంస్యపతకం అందుకుంది. 

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో తొలి రజతం అందుకున్న భారత్..ఓవరాల్‌గా 8 పతకాలు(3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో) సాధించి పతకాల పట్టికలో తొలిస్థానంలో కొనసాగుతున్నది. చైనా ఐదు పతకాలు(2 స్వర్ణ, 2 రజత, 1 కాంస్యం)సాధించి రెండోస్థానంలో నిలిచింది. కాగా, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏండ్ల అనీశ్ భన్వాలా 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. తొలిరౌండ్‌లో అద్భుతంగా రాణించినా చివరి రౌండ్‌లో అతను గురితప్పడంతో ఫైనల్ ఆరుగురిలో చోటు దక్కించుకోలేకపోయాడు.