రిషబ్‌ పంత్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం

రిషబ్‌ పంత్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం

  టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వల్లే శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఓడిపోయిందని మండిపడుతున్నారు. నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పంత్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.  వేగంగా పరుగులు రాబట్టడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. 23 బంతుల్లో కేవలం 23 పరుగులే చేశాడు. దీంతో భారత్‌ ఆతిథ్య జట్టుకు 175 పరుగుల సాధారణ లక్ష్యాన్నే నిర్ధేశించింది. 

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ధోని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పంత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పంత్‌ నీ ఇష్టం వచ్చినట్లు ఆడటానికి ఇది ఐపీఎల్‌’ కాదని ఒకరంటే పంత్‌లా ధోని ఆడితే ఇప్పటికే రిటైర్మెంట్‌ కావాలనే కామెంట్స్‌ వచ్చేవి అని ఇంకొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంత్‌ వల్లే మ్యాచ్‌ ఓడిపోయింది. అతను తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు.‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రోజు యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు మరో నేర్చుకునే రోజుగానే మిగిలిపోయింది.’ అని ప్రముఖ కామెంటేటర్‌ హర్ష బోగ్లే ట్వీట్‌ చేశాడు. ప్రపంచమంతా నీ అద్భుత ప్రదర్శన కోసం ఎదురు చూస్తే నిరాశ పరిచావు అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు.