>

సెమీస్‌లో స్మాషర్స్ జట్టు

సెమీస్‌లో స్మాషర్స్ జట్టు

బెంగళూరు: కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై స్మాషర్స్ జట్టు.. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 4-3తో ముంబై రాకెట్స్‌పై నెగ్గింది. దీంతో 14 పాయింట్లతో జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 9-11, 11-13తో ప్రణయ్ చేతిలో ఓడినా.. మిక్స్‌డ్ ట్రంప్ మ్యాచ్‌లో క్రిస్-గాబ్రియెల్లా 9-11, 11-2, 11-7తో చిరాగ్ షెట్టి-జైబాపై, మరో సింగిల్స్‌లో టామి సుగియార్తో 8-11, 11-2, 11-5తో అజయ్ జయరామ్‌పై గెలువడంతో చెన్నై 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి మ్యాచ్‌లో సింధు 11-8, 12-10తో సుంగ్ జి హున్‌పై నెగ్గి ఆధిక్యాన్ని 4-1కి పెంచింది. పురుషుల డబుల్స్ ట్రంప్ మ్యాచ్‌లో ముంబై జోడీ లీ యంగ్-పుంగ్‌పుటే 11-3, 11-5తో నెగ్గినా ప్రయోజనం లేకపోయింది.


Loading...