శుభాంకర్‌కు ఛాంపియన్‌షిప్‌  టైటిల్‌

శుభాంకర్‌కు ఛాంపియన్‌షిప్‌  టైటిల్‌

  న్యూఢిల్లీ : భారత షట్లర్‌, ఐదవ సీడ్‌ శుభాంకర్‌ దే సార్లోక్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. 25 ఏళ్ళ శుభాంకర్‌ ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 21-11, 21-14 పాయింట్ల తేడాతో కేవలం 34 నిమిషాల్లోనే ఊసెఫ్‌(ఇంగ్లండ్‌)ను చిత్తుగా ఓడించాడు. ఇంగ్లండ్‌ టాప్‌ షట్లర్‌తో తొలిసారి తలపడిన శుభాంకర్‌ ఏమాత్రం ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21-11తో గెలిచాడు. రెండోసెట్‌లోనూ ప్రత్యర్ధికి అవకాశమివ్వని శుభాంకర్‌ ఆ సెట్‌ను 21-14తో గెలిచి టైటిల్‌ను గెల్చుకోవడం విశేషం. అంతకుముందు లిన్‌ డాన్‌ను ఓడించిన చైనా షట్లర్‌పై శుభాంకర్‌ సెమీస్‌లో 21-18, 11-21, 24-22తో చెమటోడ్చి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుభాంకర్‌ సీడ్‌ 64 కాగా... ఊసెఫ్‌ సీడ్‌ 37 కావడం గమనార్హం. తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఆటగాడిపై గెలిచి శుభాంకర్‌ టైటిల్‌ గెలుపొందడం విశేషం.