సిమోనా హలెప్‌ పరాజయం

సిమోనా హలెప్‌ పరాజయం

 బీజింగ్‌ : చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ సిమోనా హలెప్‌ పరాజయం చవిచూసింది. ఈ టోర్ని మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్‌లో హలెప్‌పై ఫ్రెంచ్‌కు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి కరోలైన్‌ గార్సియా సంచలనం విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలిసారిగా ప్రముఖ టెన్నిస్‌ టైటిల్‌ను అందుకుంది. అంతేకాకుండా ఈ విజయంతో మహిళల ప్రంచ టెన్నిస్‌ ర్యాంకుల్లో టాప్‌-10లోకి దూసుకురానుంది. సోమవారం విడుదల చేయనున్న జాబితాలో గార్సియా ఏకంగా 15వ ర్యాంక్‌ నుంచి 9వ స్థానానికి ఎగబాకనుంది.

టాప్‌లో నిలవడం 23 ఏళ్ల గార్సియా కెరీర్‌లో ఇదే మొదటిసారి. కాగా, ఆదివారం విజయం గార్సియాకు వరుసగా 11వ విజయం కావడం గమనార్హం. గతవారం జరిగిన వుహాన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గార్సియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వరసగా రెండో టైటిల్‌ను గార్సియా తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో గార్సియా 6-4, 7-6(3) స్కోరుతో సునాయంగా హలెప్‌పై విజయం సాధించింది. రొమానియాకు చెందిన 26 ఏళ్ల హలెప్‌కు ఇది ఈ ఏడాదిలో ఐదో ఫైనల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.