టాప్‌సీడ్‌కు సెరెనా షాక్‌

టాప్‌సీడ్‌కు సెరెనా షాక్‌

 మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ రొమేనియాకు చెందిన హెలెప్‌ అనూహ్యంగా అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో నాల్గోసీడ్‌ జ్వెరెవ్‌(జర్మనీ)కూడా ప్రి క్వార్టర్‌ఫైనల్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 16వ సీడ్‌ కెనడాకు చెందిన రోనిక్‌ చేతిలో 6-1, 6-1, 7-6(7-5)తో ఓడాడు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను చిత్తుగా ప్రత్యర్ధికి కోల్పోయిన అనంతరం జ్వెరెవ్‌ అసహనానికి గురై మైదానంలోనే టెన్నిస్‌ రాకెట్‌ను నేలకేసికొట్టి విరిచేశాడు. మూడోసెట్‌లో గట్టి పోటీనిచ్చి నప్పటికీ కెనడా స్టార్‌ ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో జ్వెరేవ్‌ ఆ సెట్‌ను ప్రత్యర్ధికి 7-6తో కోల్పోవడంతో ప్రి క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 

టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 6-4, 6-7(5-7), 6-2, 6-3 పాయింట్ల తేడాతో మెద్వెదేవ్‌(రష్యా)పై, 8వ సీడ్‌ నిషికోరి(జపాన్‌) 6-7(8-10), 4-6, 7-6(7-4), 6-4, 7-6(10-8) హోరాహోరీ పోరులో చెమటోడ్చి బూస్టా(స్పెయిన్‌)పై గెలిచాడు. ఇతర పోటీల్లో 28వ సీడ్‌ పౌలీ(ఫ్రాన్స్‌) 6-7(4-7), 6-4, 7-5, 7-6(7-2) పాయింట్ల తేడాతో 11వ సీడ్‌ క్రొయేషియాకు చెందిన కోరిక్‌ను ఓడించాడు. రఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) 6-0, 6-1, 7-6(7-4)తో బెర్టిచ్‌ను, 22వ సీడ్‌ బూస్టా(స్పెయిన్‌) 6-7(6-8), 6-3, 6-2, 4-6, 6-4తో 8వ సీడ్‌ సిలిక్‌(క్రొయేషియా)పై పోరాడి నెగ్గాడు. ఇక మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ హెలెప్‌ను అమెరికాకు చెందిన 16వ సీడ్‌ సెరెనా విలియమ్స్‌ షాక్‌ ఇచ్చింది. సెరెనా చేతిలో 6-1, 4-6, 6-4 సెట్ల తేడాతో హెలెప్‌ ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. ఇతర పోటీల్లో 7వ సీడ్‌ ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 6-1తో 18వ సీడ్‌ మురుగుజా (స్పెయిన్‌)ను చిత్తుగా ఓడించింది. ఇక 4వ సీడ్‌ ఒసాకా(జపాన్‌) 4-6, 6-3, 6-4తో 14వ సీడ్‌ సెవస్టొవా (లాత్వియా)పై, 6వ సీడ్‌ స్విటొలినా(ఉక్రెయిన్‌) 6-2, 1-6, 6-1తో అమెరికాకు చెందిన కీస్‌పై గెలిచి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు.