యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ఒసాకాదే

యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ఒసాకాదే

 న్యూయార్క్‌ : యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో జపనీస్‌ క్రీడాకారిణి నవొమి ఒసాకా చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 6-2, 6-4 చిత్తుగా ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌పై తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న ఒసాకా సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తొలి సెట్‌ను 6-2తో చేజిక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా.. రెండో సెట్‌ జరుగుతున్న సమయంలో కోచ్‌ సాయం తీసుకోవడంపై ఛైర్‌ అంపైర్‌ హెచ్చరించాడు. దీంతో వాగ్వాదానికి దిగిన సెరెనా 'ఛైర్‌ అంపైర్‌ అబద్ధాలకోరు.. దొంగ' అంటూ నిందించి ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టింది. ఆట నిబంధనలు ఉల్లంఘించడంతో ఛైర్‌ అంపైర్‌ ఆమెకు ఒక పాయింట్‌ జరిమానా విధించాడు. తర్వాత మ్యాచ్‌ రెఫరీని పిలిచి ఛైర్‌అంపైర్‌పై ఫిర్యాదు చేసి అతను క్షమాపణ చెప్పాలని సెరెనా డిమాండ్‌ చేసింది. అనంతరం సెరెనా రెండో సెట్‌ను కూడా కోల్పోయింది. గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం సెరెనా ఆడిన మేజర్‌ ఈవెంట్‌ ఫైనల్‌ ఇదే. ఈ టైటిల్‌ గెలిచి ఉంటే సెరెనా ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరి.. మార్గరేట్‌ రికార్డును సమం చేసేది.