వింటర్ ఒలింపిక్స్‌లో తొలి డోపీ...

వింటర్ ఒలింపిక్స్‌లో తొలి డోపీ...

 ప్యాంగ్‌చాంగ్: వింటర్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు నమోదైంది. జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ క్రీడాకారుడు కై సైటో డోప్ పరీక్షల్లో దొరికిపోయాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన సైటోకు పరీక్షలు నిర్వహించగా నిషేధిత పదార్థాలు అతడు తీసుకున్నట్లు వెల్లడైందని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్) మంగళవారం పేర్కొంది. ఈవెంట్‌కు ముందు నిర్వహించిన టెస్టులో 21ఏళ్ల సైటో విఫలమవడంతో అతడు పోటీలకు దూరమైనట్లు యాంటీ డోపింగ్ అథారిటీ తెలిపింది. నిషేధిత పదార్థాల జాబితాలో ఉన్న అసిటాలోజమైడ్‌ను అతడు తీసుకున్నట్లు వివరించింది. ఒలింపిక్ క్రీడాగ్రామాన్ని అతడు స్వచ్ఛందంగానే విడిచివెళ్లాడని.. ఒలింపిక్స్, ఇతర టోర్నీలో పాల్గొనకుండా తాత్కాలికంగా నిషేధం విధించామని దర్యాప్తు కొనసాగిస్తామని సీఏఎస్ వెల్లడించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. పరీక్షలో వచ్చిన ఫలితాలు చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, అయితే కావాలని మాత్రం నిషేధిత డ్రగ్స్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.