యాపిల్‌ కొత్త ఐపాడ్‌

యాపిల్‌ కొత్త ఐపాడ్‌

  చికాగో: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్‌’ తాజాగా కొత్త ఐపాడ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇందులో 9.7 అంగుళాల స్క్రీన్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), ఏ10 ఫ్యూజన్‌ చిప్, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 ఎంపీ కెమెరా, యాపిల్‌ పెన్సిల్‌ సపోర్ట్, హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఐపాడ్‌ భారత్‌లో ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

32 జీబీ వై–ఫై మోడల్‌ ధర రూ.28,000గా, 32 జీబీ వై–ఫై + సెల్యులర్‌ మోడల్‌ ధర రూ.38,600గా ఉంది. ఇక యాపిల్‌ పెన్సిల్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంది. దీని ధర రూ.7,600. యాపిల్‌ ఐపాడ్‌తోపాటు కొత్త క్లాస్‌రూమ్‌ సాఫ్ట్‌వేర్‌ను, ఐవర్క్‌ ప్రొడక్టివిటీ యాప్స్‌ను ఆవిష్కరించింది. స్కూల్‌వర్క్‌ అనే మరొక ఉచిత యాప్‌ను విడుదల చేసింది. టీచర్లు ఈ యాప్‌లోనే విద్యార్థులకు అసైన్‌మెంట్స్, హోమ్‌వర్క్‌ ఇవ్వొచ్చు. కొత్త ఐపాడ్‌ ధర అమెరికాలోని స్కూళ్లకు 299 డాలర్లుగా, కన్సూమర్లకు 329 డాలర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.