ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ పేమెంట్స్‌ చేసుకోండి

ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ పేమెంట్స్‌ చేసుకోండి

  ఇటీవల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఒక్కొక్కటి తమ యూజర్లకు పేమెంట్‌ ఫీచర్‌ను ఆఫర్‌ చేయడం మొదలు పెట్టాయి. తాజాగా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ కూడా చడీచప్పుడు లేకుండా తన ప్లాట్‌ఫామ్‌కు పేమెంట్స్ ఫీచర్‌ను జత చేసింది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు యాప్ నుంచే ఇతరులకు డబ్బు చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందరికీ కాకుండా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన వారికి కూడా అందుబాటులోకి రానుంది. దీనికోసం తొలుత యూజర్లు తమ ప్రొఫైల్‌కు క్రెడిట్ లేదా డెబిట్ కార్డును జత చేసి పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బయటికి రాకుండా ఆ పిన్ ఆధారంగా కావాల్సిన వారికి చెల్లింపులు చేసుకోవచ్చు. 

అంతేకాక కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు. తమ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్స్‌ ఫీచర్‌ను జత చేసిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అధికార ప్రతినిధి ధృవీకరించారు. రెస్టారెంట్లు, సెలూన్లు వంటి వాటిని బుక్‌ చేసుకుని పేమెంట్లు జరుపుకోవచ్చని, పరిమిత సంఖ్యలో పార్టనర్లతో ఈ సేవలను లైవ్‌లోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పేమెంట్‌ సెట్టింగ్స్‌ను కొందరికి కనిపించేలా చేస్తున్నామని, కానీ అందరికీ ఇది ఇప్పుడే అందుబాటులోకి రాదని కంపెనీ పేర్కొంది. అమెరికాలో కొందరికి, యూకే కొందరికి ఇది అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్‌ పేమెంట్స్‌ నిబంధనలకు అనుగుణంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌ పేమెంట్స్‌ పనిచేయనుంది. ఒకటికి మించిన సేవలకు అనువుగా మార్చడం ద్వారా యూజర్లను నిలుపుకునే ప్రయత్నాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫోటో షేరింగ్ యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ ఇక చెల్లింపుల సాధనంగానూ ఉపయోగపడనుందని తెలిపారు.