ఐఫోన్ 8, 8 ప్లస్‌ల విడుదల

ఐఫోన్ 8, 8 ప్లస్‌ల విడుదల

యాపిల్ సంస్థ తన నూతన ఐఫోన్ 8, 8 ప్లస్‌లను లాంచ్ చేసింది. మొదటి ఐఫోన్ విడుదల చేసి 10 వసంతాలు పూర్తయినందున అందుకు గుర్తుగా ఐఫోన్ 10ను ప్రత్యేకమైన ఎడిషన్ రూపంలో యాపిల్ విడుదల చేసింది. దీంతో పాటు ఐఫోన్ 8, 8 ప్లస్‌లను లాంచ్ చేసింది.

ఐపోన్ 8 లో 4.7 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1334 x 750 పిక్సల్స్‌గా ఉంది. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో అయితే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్‌గా ఉంది. రెండు ఫోన్ల డిస్‌ప్లేలకు 3డీ టచ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ డిస్‌ప్లేలకు అయాన్ స్ట్రెంగ్తెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు.
గతంలో వచ్చిన ఐఫోన్ 7, 7 ప్లస్ ల మాదిరిగానే ఐఫోన్ 8, 8 ప్లస్‌లను కూడా డిజైన్ చేశారు. అందులో పెద్దగా మార్పులు లేవు. ఐఫోన్ 7 ప్లస్‌లో లాగానే 8 ప్లస్‌లో వెనక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక రెండు ఫోన్ల బాడీలను నూతన తరహా గ్లాస్‌తో తయారు చేశారు. అల్యూమినియం ఉపయోగించడం వల్ల ఫోన్లకు ప్రీమియం క్వాలిటీ లుక్ వచ్చింది. 

ఐఫోన్ 8, 8ప్లస్‌లలో అధునాతన యాపిల్ ఎ11 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు కోర్లు (హెగ్జాకోర్) ఉన్నాయి. దీని వల్ల గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్ కన్నా ఐఫోన్ 8, 8ప్లస్‌లు వేగంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ ఫోన్లలో ఎం11 మోషన్ కో ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఐఫోన్ 8 లో 2 జీబీ ర్యామ్ ఉండగా ఇది 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తున్నది. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, ఇది కూడా 64, 256 జీబీ వేరియెంట్లలో లభిస్తున్నది.

ఐఫోన్ 8 వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ ఉండడం వల్ల కుదుపులు ఉన్నప్పటికీ ఫొటోలు, వీడియోలు షేక్ అవకుండా వస్తాయి. 4కె అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కెమెరా పక్కనే ఇవ్వడం వల్ల తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫొటోలను తీసుకోవచ్చు. ఇక ఐఫోన్ 8 ముందు భాగంలో 7 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో అయితే వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను పక్క పక్కనే ఏర్పాటు చేశారు.ఐఫోన్ 8 బ్యాక్ కెమెరాకు ఉన్న ఫీచర్లు ఈ కెమెరాలకు కూడా ఉన్నాయి. ఐఫోన్ 8 ప్లస్ ముందు భాగంలో కూడా 7 మెగాపిక్సల్ సామర్థ్యం, . దీంతో కూడా నాణ్యమైన సెల్ఫీలను, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. 

ఐఫోన్ 8, 8 ప్లస్ రెండు కూడా 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. దీంతో ట్రూ 4జీని వీటిలో ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్‌డీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సిమ్ వీటిలో భేషుగ్గా పనిచేస్తుంది. కాకపోతే ఎప్పటిలా ఈ ఫోన్లలో కేవలం సింగిల్ సిమ్ సదుపాయం మాత్రమే కల్పించారు. దీంతో కేవలం ఒకే సిమ్‌ను వీటిలో వేసుకునేందుకు వీలుంటుంది. ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో డ్యుయల్ సిమ్ ఫీచర్ వస్తుందని తొలుత అందరూ భావించారు. అయినప్పటికీ వీటిలో ఎప్పటిలాగే సింగిల్ సిమ్ ఫీచర్‌నే ఇచ్చారు. ఇక ప్రత్యేకంగా మెమొరీ కార్డును కూడా వేసుకునేందుకు వీలులేదు. ఇది కూడా ఐఫోన్‌లలో ఎప్పటి నుంచో అలాగే వస్తున్నది. ఇందులోనూ ఎలాంటి మార్పు లేదు.

గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో ఐఫోన్ 8, 8 ప్లస్‌లు లభిస్తున్నాయి. ఐఫోన్ 8 భారత్‌లో రూ.64వేల ప్రారంభ ధరకు లభ్యం కానుండగా, ఐఫోన్ 8 ప్లస్ రూ.73వేల ప్రారంభ ధరకు లభ్యం కానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెరికా సహా పలు దేశాల్లో ఈ రెండు మోడల్స్ అందుబాటులోకి రానుండగా, భారత్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఐఫోన్ 8, 8ప్లస్‌లు లభించనున్నాయి.