ఎంఐ పే మొబైల్ పేమెంట్ సొల్యూషన్‌....

ఎంఐ పే మొబైల్ పేమెంట్ సొల్యూషన్‌....

  మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లో ఎంఐ పే పేరిట నూతన మొబైల్ పేమెంట్ సొల్యూషన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, పేయూ కంపెనీలతో భాగస్వామ్యమైన షియోమీ ఈ పేమెంట్ సర్వీస్‌ను భారత్‌లోని యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలోనే ఎంఐ పే కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) లార్జ్ గ్రూప్ యూసేజ్ కోసం క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో త్వరలో ఎంఐ పే మొబైల్ పేమెంట్ సేవలను షియోమీ తన యూజర్లకు అందివ్వనుంది. ఇక ఈ పేమెంట్ ప్లాట్‌ఫాంపై దాదాపుగా అన్ని ప్రధాన బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు. గూగుల్ పే, వాట్సాప్ పేమెంట్స్‌లో వీటికి సపోర్ట్ లభించడం లేదు. అందుకనే షియోమీ ఈ కార్డులకు కూడా తన ఎంఐ పే మొబైల్ పేమెంట్ ప్లాట్‌ఫాంపై సపోర్ట్‌ను అందివ్వనుంది.

ఎంఐ పే మొబైల్ పేమెంట్ యాప్‌లో యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ బిల్లులు, వాటల్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించుకోవచ్చు. డీటీహెచ్, మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. ఇక యూజర్ల సమాచారం కూడా యాప్‌లో సురక్షితంగా ఉంటుంది. ఎంఐ పే మొబైల్ పేమెంట్ యాప్‌లో యూజర్లు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్, భారత్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి బిల్స్ చెల్లించవచ్చు. ఇతర యూజర్ల నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకునేందుకు స్టాటిక్, డైనమిక్ క్యూఆర్ కోడ్‌ను అప్పటికప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎంఐ పే యాప్‌కు చెందిన బీటా వెర్షన్ ఇప్పటికే షియోమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దాన్ని కావాలనుకుంటే యూజర్లు టెస్ట్ చేయవచ్చు. డిసెంబర్ 31వ తేదీన ఎంఐ పే యాప్‌ను షియోమీ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది.