నడిచే కారును తయారుచేసిన హ్యుండాయ్

నడిచే కారును తయారుచేసిన హ్యుండాయ్

 కారు పరుగెడుతుంది. కానీ నడవడం ఏమిటి? కాళ్లుంటేనే కదా నడిచేది? కారుకు కాళ్లేమిటి? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే ఎవరి మదిలోనైనా మెదులుతాయి పై శీర్షిక చూస్తే. కార్ల దిగ్గజం హ్యుండాయ్ నిజంగానే నడిచే కారును తయారు చేసింది. ప్రమాదకరమైన, దుర్గమమైన రహదారుల్లో ప్రయాణించేందుకు ఈ కూరును రూపొందించారు. మామూలు కారు రోడ్డుంటేనే ముందుకు సాగుతుంది. కొండలు గుట్టలు దానికి పనికిరావు. కానీ హ్యుండాయ్ సోమవారం లాస్‌వెగాస్‌లో ప్రదర్శించిన ఎలివేట్ కారు సాలీడులా పొడవాటి కాళ్లమీద నడుస్తుంది. ఓరకంగా చెప్పాలంటే రోబోను, కారును సంకరం చేస్తే ఇది తయారైందని చెప్పొచ్చు. మనిషి కాలు తరహాలో మోకాలు, చీలమండ కీలుతో కూడిన కాళ్లు దీని ప్రత్యేకత. విద్యుచ్ఛక్తితో ఇది నడుస్తుంది. దీనిని సర్వోన్నతమైన చలనయంత్రంగా చెప్పుకుంటున్నారు. 

కొండలపైన లేదా మామూలుగా అయితే వెళ్లలేని ప్రదేశాల్లోకి అన్వేషణ కొరకు, ప్రమాదాల సమయాల్లో దీనిని పంపించవచ్చు. ఇది ఎక్కడికైనా సులభంగా వెళ్లగలుగుతుంది. ఘోరవిపత్తులు సంభవించినప్పుడు ఈ కారు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని హ్యుండాయ్ ప్రతినిధి జాన్ సూ చెప్పారు. దీని కాళ్ల చివరన చక్రాలు కూడా ఉంటాయి. రోడ్డు మామూలుగా ఉంటే చక్రాలమీద యథావిధిగా ఇది పరుగెడుతుంది. పొడవైన కాళ్లుండే జంతువుల నడక విధానాలను ఇది అనుకరిస్తుంది. 5 అడుగులు లేదా 1.5 మీటర్ల ఎత్తున్న గోడలను కూడా ఇది దాటగలుగుతుంది. వికలాంగులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మెట్ల వల్ల చక్రాలకుర్చీ ఉపయోగానికి ఏర్పడే పరిమితులకు ఇది చెక్ పెడుతుంది.