నకిలీ యాప్‌లతో జాగ్రత్త: క్విక్ హీల్

నకిలీ యాప్‌లతో జాగ్రత్త: క్విక్ హీల్

 సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన ప్లే స్టోర్‌లో నకిలీ యాప్‌లు ఎక్కువగా ఉన్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్ వెల్లడించింది. ప్లే స్టోర్‌లో ఉన్న నకిలీ యాప్‌లు నిజమైన యాప్‌ల మాదిరిగా ఉండడంతో వాటిని నకిలీ యాప్‌లుగా యూజర్లు గుర్తించడం లేదని క్విక్ హీల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా ఈ నకిలీ యాప్‌లు యూజర్లను తప్పుదోవ పట్టించి అడ్డదారిలో ప్లే స్టోర్‌లో 5 రేటింగ్ వచ్చేలా చేసుకుంటున్నారని అన్నారు. 

యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసిన అనంతరం యాప్‌ను ఉపయోగించుకోవాలంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలని యూజర్లకు మెసేజ్‌లు కనిపిస్తున్నాయని, దాంతో సహజంగానే యాప్‌ను వాడుకునేందుకు వారు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నారని, దీంతో నకిలీ యాప్‌లకు అడ్డదారిలో రేటింగ్ పెరుగుతుందని క్విక్ హీల్ తెలిపింది. కనుక ఈ నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలని యూజర్లను యాప్ బలవంతం చేస్తే వెంటనే అలాంటి యాప్‌లను ఫోన్ నుంచి తీసేయాలని క్విక్ హీల్ ప్రతినిధులు చెబుతున్నారు.