నేడు విడుదల కానున్న ఐఫోన్ 8..!

నేడు విడుదల కానున్న ఐఫోన్ 8..!

 ఐఫోన్ 8. యాపిల్ నుంచి వ‌స్తున్న నూత‌న ఐఫోన్ మోడ‌ల్‌. దీనికి కొంద‌రు ఐఫోన్ ఎక్స్ అని కూడా పేరు పెట్టే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే చెబుతూ వ‌చ్చారు. ఎందుకంటే ఐఫోన్ తొలిసారిగా విడుద‌లై 10 వ‌సంతాలు పూర్త‌యినందున అందుకు గుర్తుగా నూతన ఐఫోన్‌కు ఐఫోన్ ఎక్స్ అని పేరు పెట్ట‌వ‌చ్చ‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త ఐఫోన్ ఇవాళ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. కాలిఫోర్నియా కుప‌ర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ క్యాంప‌స్‌లోని స్టీవ్ జాబ్స్ థియేట‌ర్‌లో ఐఫోన్ 8ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానున్న ఐఫోన్ 8లో ప్ర‌ధానంగా అందించ‌నున్నార‌ని చెప్పుకోబ‌డుతున్న ఫీచ‌ర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


శాంసంగ్ విడుద‌ల చేసిన గెలాక్సీ ఎస్‌8, ఎస్8ప్ల‌స్‌, నోట్‌8తోపాటు ప‌లు ఇత‌ర మొబైల్ కంపెనీలు ఇప్పుడు నూత‌న త‌ర‌హా బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఫోన్ల‌లో ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి ఫోన్ల‌లో ముందు భాగంలో ఫోన్ బాడీ క‌న్నా స్క్రీన్ ఎక్కువ‌గా ఉంటుంది. స‌రిగ్గా ఇలాంటి డిస్‌ప్లేనే ఐఫోన్ 8 లో యాపిల్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. ఇక ఈ డిస్‌ప్లేను సూప‌ర్ అమోలెడ్ టైప్‌లో అందివ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా ఐఫోన్ 8 ప్ల‌స్ మోడ‌ల్ వెనుక భాగంలో రెండు కెమెరాల‌ను ప‌క్క ప‌క్క‌నే కాకుండా ఒక దాని కింద ఒక‌టి ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. 

ఇక నూత‌నంగా విడుద‌ల కానున్న ఐఫోన్ 8 లో మిగిలిన ఫీచ‌ర్ల విష‌యానికి వస్తే వైర్ లెస్ చార్జింగ్‌, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, యూజ‌ర్ ముఖంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసే ఫేస్ ఐడీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఐఫోన్ 8లో ప్ర‌ధానంగా అందిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతోపాటు గ‌తంలో విడుద‌ల చేసిన ఐఫోన్ 7, 7ప్ల‌స్ ఫోన్ల‌కు కొనసాగింపుగా ఐఫోన్ 7ఎస్‌, 7ఎస్ ప్ల‌స్ మోడ‌ల్స్‌ను, కొత్త వాచ్‌ను కూడా యాపిల్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఇక ఐఫోన్ 8తోపాటు, ఐఫోన్ 8 ప్ల‌స్‌ను కూడా విడుద‌ల చేస్తార‌ని, ఇవి రెండూ కాకుండా ఐఫోన్ ఎక్స్ పేరిట మ‌రో మోడ‌ల్‌ను కూడా యాపిల్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.